-->

ఉదయించే సూర్యుని వలె వున్నారు | Judges 3-5 | Telugu Bible Study



న్యాయాధిపతులు 3వ అధ్యాయము

    వాగ్దాన దేశములో నివసిస్తున్న ఇశ్రాయేలీయుల మధ్యలో ఫిలిష్తీయులు, కనానీయులు ఇంకా నివాసిస్తూనే వున్నారు.ఇశ్రాయేలీయులు వారిని ఇంకా   పూర్తిగా  వెళ్ళగొట్టనందున దేవుడు వారిని అక్కడే ఉండనిచ్చాడు. ప్రజలు ఆజ్ఞలు, కట్టడలను అనిసరించి నడుస్తారో లేదో అని పరిశోధించడానికి, వారికి పోరాడటం నేర్పించడానికి, దేవుడు కనానీయులను ఉంచేశాడు.

       దేవుడ్ని ఎంతవరకు ప్రేమిస్తున్నాము? ఎంతవరకు నమ్మకస్థులమై ఆయనకు లోబడుతున్నాము? మనం జయించవలసినవి ఏమిటి? విడిచి పెట్టాల్చినవి ఏమిటి? ఏ విషయాలని నేర్చుకోవాలి, వేటిలో ఎదగాలి ఇలా మన గురించి మనం తెలుసుకుని, ప్రతీ పోరాటంలోను ఆయన మీద ఆధారపడి జీవించాలని, దేవుడు మన విశ్వాస్యతని పరిశోధిస్తాడు. మనం పోరాటం నేర్చుకోవాలని,  ఎవర్ని మింగుదామా అని చూస్తున్న అపవాదిపై పోరాడటానికి ఎప్పుడూ సిద్ధముగా ఉండాలని ఆయన మనకి నేర్పిస్తున్నాడు.

ఒత్నియేలు

      అయితే ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు కనానీయులతో, వారి హేయమైన పనులతో పోరాడకుండా, వారితో కలిసిపోయి, పెళ్లిళ్లు చేసుకుని, వారి దేవతలని పూజిస్తూ దేవునికి కోపం పుట్టించారు. పాపము దేవునికి కోపం పుట్టిస్తుంది. తన  దృష్టికి దోషులై అన్యదేవతలను పూజిస్తున్న ఇశ్రాయేలు ప్రజలని, దేవుడు ఆ దేవతలని పూజించే రాజుకి  దాసులుగా అమ్మివేశాడు. తమ దేశంలోనే దాసులుగా ఉన్న ప్రజలకి 8 సంవత్సరాల తర్వాత గ్రహింపు కలిగి, దేవుని వైపు చూసి ఆయనకి మొఱ్ఱపెడుతున్నారు. వారి మొఱ్ఱను విని దేవుడు కాలేబు అల్లుడైన ఒత్నియేలును రక్షకునిగా పంపించాడు. దేవుని ఆత్మ ఒత్నియేలు మీదకి వచ్చినప్పుడు అతడు యుద్దానికి వెళ్లి జయించి, ప్రజలని దాస్యము నుండి విడిపించాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన మీదకి వచ్చినప్పుడు , పాపం , తీర్పు, నీతి గురించి ఒప్పింపచేసి మనల్ని పవిత్రపరుస్తాడు. మనలో  నివసించి, మనము చేయవలసినవాటిని మనకి భోదిస్తాడు. పరిశుద్ధముగా, నీతిగా జీవించాడనికి, ఫలభరితముగా జీవించడానికి సహాయం చేస్తాడు. మన శక్తి చేత, యుక్తి చేత జయించలేము కానీ దేవుని ఆత్మ చేతనే  పాపాన్ని, శరీర స్వభావాన్ని జయిస్తాము. ఒత్నియేలు దేవుని ఆత్మ చేత జయించి, ప్రజలని దాస్యం నుంచి విముక్తి చేశాడు.  తర్వాత అతను బ్రతికియున్న 40 సంవత్సరాలు కూడా దేశం నెమ్మది కలిగి ఉంది.

    అయితే అతను మరణించిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలు, ఆ విడుదలని, నెమ్మదిని కొనసాగించలేదు. మరలా నెమ్మదిగా దేవుని దృష్టికి దోషులై, మోయాబు రాజైన ఎగ్లోనుకు దాసులయ్యారు. వారి పితరులు వెళ్లగొట్టకుండా విడిచిపెట్టిన ఆ శత్రువులకి ఇప్పుడు కుమారులు దాసులైపోతున్నారు. కొన్నిటిని జయిస్తాము, కొన్నిటిని జయించడానికి ఇష్టపడము. అలా ఏ పాప స్వభావాన్ని జయించకుండా, రాజీపడిపోయి, హృదయంలో ఉండనిస్తామో దానికి , మనమూ, మన పిల్లలు దాసులైపోతారు. అందుకే అపవాదిని ఎదిరించండి, వాడు మీ యొద్దనుండి పారిపోతాడు అని వాక్యం చెప్పుచున్నది. ఎదిరిస్తే వాడు పారిపోతాడు, ఎదిరించకపోతే వాడికి మనం దాసులమైపోతాము. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు 18 సంవత్సరాల పాటు మోయాబు రాజుకు దాసులై పోయారు. శరీరాన్ని జయించకుండా, లోకంతో కలిసిపోయి, లోకాన్ని తమ జీవితాల్లోకి, కుటుంబాల్లోకి రానిచ్చి, ఇప్పుడు లోకానికి, శరీరానికి, అపవాదికి దాసులుగా ఉన్నారు. 18 సంవత్సరాల తర్వాత వారి దాస్యమనే శిక్షను బట్టి, వారి పరిస్థితిని తెలుసుకుని, తాము కోపం పుట్టించిన నిజమైన దేవునికి మొఱ్ఱపెడుతున్నారు.

ఏహూదు

          ఇప్పుడు కూడా దేవుడు వారి మొఱ్ఱను విని, బెన్యామీనీయుడైన ఏహూదును వారికోసం రక్షకునిగా నియమించాడు. అప్పుడు ఏహూదు, ఇశ్రాయేలీయులు మోయాబు రాజుకి చెల్లించాల్చిన కప్పము తీసుకుని, ఆ రాజుకి ఇచ్చి, నీకో రహస్యం చెప్పాలి అని అక్కడున్న వాళ్ళందరూ వెళ్లిపోయేవరకు ఆగుతాడు. రాజు, ఇంకా అతను మాత్రమే ఉన్నప్పుడు, దేవుని మాట నీకొకటి చెప్పాలి అని రాజు దగ్గరకెళ్లి, ఎవ్వరికీ అనుమానం రాకుండా తాను తెచ్చుకున్న కత్తితో రాజుని పొడిచి, బయటకెళ్లిపోయాడు. తర్వాత ఇశ్రాయేలీయులని పిలిచి, మీ శత్రువులైన మోయాబీయులని దేవుడు మీ చేతికి అప్పగిస్తున్నాడు అని చెప్పగా, వారు వెళ్లి  పరాక్రమము గల బలశూరులైన మోయాబీయులని ఓడించారు. ప్రజల కోసం దేవుడు ఏహూదుని నియమించినప్పుడు, అతడు సమాన్యుడైనప్పటికి ధైర్యముగా రాజుని అతని కోటలోనే ఎదుర్కొన్నాడు. ఎడమ చేతి వాటం గల ఏహూదు చేతికి స్థూలకాయుడైన ఎగ్లోను చిక్కాడు. శూరులైన మోయాబీయులపై విజయానికి, ఏహూదు ముందడుగు వేశాడు. 

    మనం బలహీనులము కావచ్చు గానీ, దేవుని ఆత్మ మనల్ని బలపరుస్తుంది. దేవుడ్ని నమ్మకంగా వెంబడించే క్రమంలో, మన స్వభావం పైనా, అపవాదిపైనా మనం చేసే పోరాటాల్లో పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. మోయాబీయులను జయించిన తర్వాత 80 సంవత్సరాలు దేశం నిమ్మళంగా ఉంది. ఏహూదు తర్వాత  షమ్గరు న్యాయాధిపతిగా ఉండి, ప్రజలను ఫిలిష్తీయుల నుండి రక్షించాడు. వాక్యము, ప్రార్థన, పరిశుద్ధాత్మ సహాయం చేత మనం లోకానికి దాసులం కాకుండా కాపాడబడతాము.

4వ అధ్యాయము

      80 సంవత్సరాల తర్వాత ఇశ్రాయేలీయులు దేవుని దృష్టికి మరింత దోషులయ్యారు. తమపైన దేవుని అధికారానికి ఒప్పుకోకుండా, స్వేచ్ఛగా, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. దేవుని దృష్టిలో మరింత దోషులవుతున్నారు గానీ, మరింత నమ్మకస్థులుగా ఉండట్లేదు. తనను విడిచిపెట్టి దోషులైన వారిని దేవుడు, యాబీను అనే రాజు చేతికి అప్పగించేశాడు. అతని సేనాధిపతి అయిన సిసేరా, ఇశ్రాయేలు ప్రజలని కఠినంగా అణిచివేశాడు. 20 సంవత్సరాల కఠిన అణచివేత తర్వాత ప్రజలు దేవునికి మొఱ్ఱపెడుతున్నారు. వీరిలో నిజమైన పశ్చాత్తాపం, దేవుని యందు భయభక్తులు లేవు. శ్రమ వచ్చినప్పుడు మొఱ్ఱపెడుతున్నారు, విడుదల కలిగిన తర్వాత దేవుడ్ని విడిచి పెట్టేస్తున్నారు. వారు ఆయనని విడిచిపెట్టినా తనకి మొఱ్ఱపెట్టిన వారిని దేవుడు విడిచిపెట్టట్లేదు. వారి మొఱ్ఱని వినకుండా ఉండట్లేదు. అయితే తన పద్దతిలో శత్రురాజులను ఉపయోగించుకుని ప్రజలని శిక్షించి, రక్షిస్తున్నాడు. 

దెబోరా - బారాకు

         ఆ కాలంలో దెబోరా అనే ఒక స్త్రీ ఇశ్రాయేలీయులకి, తీర్పు తీర్చుచు న్యాయధిపతిగా, ఒక ప్రవక్తినిగా వారి మధ్యలో ఉంది. ఆమె బారాకు అనే అతనిని పిలిచి 10 వేల మంది మనిషులని తీసుకుని  తాబోరు కొండకు వెళ్ళు, సిసేరాని, అతని సైన్యాన్ని నీకు అప్పగిస్తానని దేవుడు చెప్పలేదా అని అడుగుతుంది. దేవుడు చెప్పినా ధైర్యం లేక వెళ్లకుండా ఉన్న బారాకు కి, దేవుని మాటని గుర్తుచేసి అతను చేయవలసిన పనిని పురమాయిస్తుంది. అయితే బారాకు దెబోరాతో నీవు నాతో కూడా వస్తేనే యుద్ధానికి వెళ్తాను, నువ్వు రాకపోతే వెళ్లను అని చెప్తాడు. డెబోరాతో దేవుడున్నాడు కాబట్టి ఆమె ధైర్యముగా ఉంది. కాబట్టి ఆమె మాతో రాదు అని అనుకున్నాడు గానీ, తనకి మాట ఇచ్చిన దేవుడు తనతో ఉంటాడు అనే నమ్మకం అతనికి లేదు. అప్పుడు దెబోరా అతనితో,  నేను నీతో కూడా వస్తాను కానీ అందువలన నీకెలాంటి ఘనత కలగదు. సిసేరాని దేవుడు ఒక స్త్రీ చేతికి అప్పగిస్తాడు అని చెప్పింది.

     


      బారాకుని ధైర్యపరుస్తూ దెబోరా అతనితో పాటు, 10 వేల మంది మనుషులని తీసుకుని తాబోరు కొండ దగ్గరకి వెళ్లారు. ఈ విషయం తెలిసిన సిసేరా ఇనుప రథాలని తీసుకుని, తన దగ్గర ఉన్న సమస్త జనమును తీసుకుని వీరికి ఎదురు బయల్దేరాడు.    అప్పుడు దెబోరా, బారాకూ లెగు, దేవుడు సిసేరాని నీకు అప్పగించిన రోజు ఇదే, ఇదిగో ముందుగా దేవుడు వెళ్తాడు అని చెప్తుంది. ఇనుప రథాలని, అంతపెద్ద సైన్యాన్ని జయించే సామర్ధ్యం తమకుందో, లేదో అని భయపడకుండా, దేవుని మాట తీసుకుని బారాకు వెళ్లాలని దెబోరా అతనిని ధైర్యపరచింది. దేవుని మాటలని చెప్పడానికి ఆమె భయపడలేదు.దేవుడు నీకు ముందుగా వెళ్తాడు అని దెబోరా చెప్పినప్పుడు, బారాకు, 10 వేల మందితో తాబోరు కొండ దిగి, సిసేరాని  ఎదుర్కోడానికి వచ్చాడు. దేవుడు సిసేరాని, అతని రథములని, అతని సర్వ సైన్యాన్నీ కలవరపరచి, బారాకు కి సహాయం చేశాడు. బారాకు , సిసేరా సైన్యమంతటిని పట్టుకున్నాడు. 

యాయేలు

       సిసేరా ఒక్కడు మాత్రం పారిపోయాడు. అయితే పారిపోయి వస్తున్న సిసేరాను, హెబెరు భార్య అయిన యాయేలు చూసి భయపడవద్దు, ఇటు రమ్మని పిలిచినప్పుడు అతడు వస్తాడు. హెబెరుతో సిసేరా సమాధానంగా ఉండేవాడు కాబట్టి అతని భార్య పిలిచినప్పుడు  సిసేరా ఏ భయం లేకుండా గుడారములోకి వెళ్లి దాక్కుంటాడు. ఎవరైనా వచ్చి అడిగితే ఇక్కడ ఎవరూ లేరు అని చెప్పమని యాయేలు కి చెప్పి, ఆమె గుడారములో నిశ్చింతగా గాఢనిద్ర పోతూ ఉంటాడు. అప్పుడు యాయేలు గుడారపు మేకు ఒకదానిని తీసుకుని అతని కణతలోకి కొడుతుంది. దేవుని ప్రజలని కఠినంగా అణిచివేసిన సిసేరా ఈ స్త్రీ చేతిలో మరణించాడు. అప్పుడు అతని రాజైన యాబీను కు విరోధముగా ఇశ్రాయేలీయులు హెచ్చింపబడి అతడ్ని అణిచివేసి అంతం చేస్తారు.

    పాపమునకు సాదృశ్యముగా ఉన్న సిసేరాను  చంపినప్పుడు దాని యజమాని అయిన అపవాదిని అంతం చేయగలుగుతాము. పారిపోయాడులే అని బారాకు వదిలేసినట్లు పాపాన్ని తేలికగా తీసుకోకూడదు. యాబీనును అణిచివేసే వరకు ఇశ్రాయేలీయుల చేయి అతనికి విరోధముగా హెచ్చుచూ వచ్చినట్లు, అపవాదిని జయించేవరకు మనం ఆత్మలో వృద్ధి చెందుతూ ఉండాలి. 

           యేసయ్య సిలువలో మన కోసం గెలిచిన యుద్ధాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మనలో కూడా పూర్తి చేస్తాడు. తన ఆత్మ చేత మనల్ని ఒప్పించి, సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. సత్యములో ఎదుగుచూ, పాపాన్ని, పాప స్వభావాన్ని జయించినప్పుడు సాతానుకి మన పైన అధికారం ఉండదు గానీ, వాడు మన చేత అణిచివేయబడలేదు.

  5వ అధ్యాయము

   20 సంవత్సరాలుగా తమని అణిచివేసిన సిసేరాపై, యాబీను రాజుపై జయం పొందిన తర్వాత బారాకు,డెబోరాలు దేవుని స్తుతిస్తూ కీర్తన పాడారు. ఇశ్రాయేలీయులు దేవుని మాటకి సంతోషముగా సిద్ధపడి, ధైర్యాన్ని చూపించినప్పుడు, భూమి వణికింది, ఆకాశం వర్షించింది. అయితే ప్రజలు కొత్త దేవతలని కోరుకున్నప్పుడు యుద్ధం వారి గుమ్మం దగ్గరకి వచ్చింది. వారి కోసం ఒక్క నాయకుడు గానీ, అధిపతి గానీ  లేని కాలంలో, ఇశ్రాయేలీయులకి తల్లిగా దెబోరా అనే నన్ను  నియమించాడు అని ఆమె పాడుతున్నది. భయంకరమైన దుస్థితిలో ఉన్నప్పుడు, ఒక్క కేడెము గానీ, ఈటె గానీ మాకు లేనప్పుడు, నా ప్రాణమా బలం తెచ్చుకుని ముందుకి వెళ్ళు అని ధైర్యపరచుకుని విశ్వాసముతో బారాకు, దెబోరాలు కలిసి వెళ్లారు. బెన్యామీనీయులు, జేబులూనీయులు, ఇశ్శాఖారీయులు, తమ ప్రాణాలను తృణీకరించి, మరణ భయం లేకుండా వెళ్ళి సిసేరాతో యుద్ధం చేశారు. దేవుడు వారికి సహాయం చేశాడు. గుడారములలో ఉండు స్త్రీలలో యాయేలు దీవెన పొందుతుంది అని వారు కీర్తన పాడారు. దేవుని శత్రువులు నశిస్తారు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు అని పాడి ముగించారు. సిసేరా మరణించిన తర్వాత 40 సంవత్సరాల పాటు దేశము నిమ్మళంగా ఉంది. 


అప్పగించిన పని నమ్మకంగా


          తమ తోటి ప్రజలందరూ లోకంతో స్నేహం చేసి దేవుని దృష్టికి దోషులైనప్పుసు, వారి వారి కాలంలో ఒత్నియేలు, ఏహూదు, షమ్గరు మరియు డెబోరాలు దేవుడ్ని నమ్మకంగా హత్తుకుని ఉన్నారు. సామాన్యులైనప్పటికి నమ్మకస్తులైన వీరిని దేవుడు తన ప్రజలకి రక్షకులుగా నియమించాడు. దెబోరా ఒక స్త్రీ అయినప్పటికీ, దేవుడిచ్చిన అధికారంతో, ధైర్యముగా యుద్ధానికి ముందుండి నడిపించింది. ఆమె యుద్ధం చేయలేదు గానీ, యుద్ధశూరులని బలపరచి, ప్రజలని అణచివేత నుండి విడిపించింది. యెహోవాను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె ఉంటారు. ( న్యాయాధిపతులు 5:31)

ప్రార్ధన

పరిశుద్ధ ప్రేమగల తండ్రీ, నీ గొప్ప నామమును వందనాలు. మాటిమాటికీ తప్పిపోతున్న  మా యెడల నీ దీర్ఘశాంతమును చూపిస్తునందుకు వందనాలు. నీ క్రమశిక్షణలో నేర్చుకుని ఆత్మీయముగా బలపడడానికి సహాయం చేయండి. నీ మహిమలో చేరే వరకూ కూడా, ఆత్మలో ఎదుగుచూ, శరీరాన్ని జయించడానికి, లోకంతో స్నేహం చేయక అపవాదిని జయించడానికి శక్తినివ్వండి. నీవు నియమించిన రక్షకుల వలె ధైర్యముగా, నీ పని చేయడానికి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రీ ఆమెన్.
--శుభవచనం