-->

నేనును నా ఇంటి వారును | Joshua 24 | Telugu Bible Study

 Joshua 24 | నేనును నా ఇంటి వారును| బైబిల్ అధ్యయనము


యెహోషువ 24వ అధ్యాయము

       యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రములవారినందరిని షెకెములో పోగుచేసి వారి ప్రధానులు, నాయకులను ముందుకి పిలిచినప్పుడు వారు దేవుని సన్నిధిలో నిలబడ్డారు. అప్పుడు యెహోషువ చివరి సారిగా దేవుని మాటలను వారికి చెప్తున్నాడు.

యెహోవానైన నేను

       మీ పితరుడైన అబ్రాహామును ఇక్కడికి తీసుకునివచ్చి, ఈ కనాను దేశములో సంచరింప చేసి, అతని సంతానాన్ని విస్తరింపజేశాను. యాకోబు కాలంలో ఐగుప్తుకి వెళ్ళినప్పుడు, తర్వాత మోషేని అహరోనుని పంపించి అక్కడ గొప్ప క్రియలు చేసి,మిమ్మల్ని బయటకి రప్పించాను. అక్కడ నుండి ఎర్రసముద్రాన్ని దాటిన తర్వాత చాలా కాలం అరణ్యములో నివశించారు. అప్పుడు మిమ్మల్ని శపించాలనుకున్నవారి చేతినుండి విడిపించాను. అమోరీయులని, మోయాబీయులను మీకు అప్పగించాను. మీ ఖడ్గము చేత, విల్లు చేత కాదు గానీ కందిరీగలను పంపించి మీతో యుద్ధము చేసే వారిని మీ ముందర నుంచి తోలివేశాను. మీరు సేద్యం చేయని దేశంలో, మీరు కట్టని ఇండ్లలో ఇప్పుడు మీరు నివసిస్తున్నారు. మీరు నాటని ద్రాక్ష తోటల పండ్లు తింటున్నారు అని దేవుని యొక్క విశ్వాస్యతని ప్రజలకి గుర్తు చేస్తున్నాడు.

        ఇశ్రాయేలీయుల పితరుడైన అబ్రహాము పుట్టుకతోనే యూదుడు కాదు. దేవుడుతనిని ఏర్పరచుకొని తన పూర్వస్థితి నుండి విడిపించి, అతనితో ప్రమాణం చేసి, ఆశీర్వదించి, నేడు ఈ దేశాన్ని అతని సంతానానికి స్వాధీనం చేసాడు. వీరు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు వారిని అలాగే విడిచిపెట్టేయకుండా మోషేని పంపించి, బయటకి తీసుకువచ్చాడు. వారి మీద ఏ శాపము పడకుండా, శత్రువుల భయం లేకుండా నెమ్మది నిచ్చి కాపాడాడు.

        మాట ఇచ్చి తప్పని దేవుని యొక్క విశ్వాస్యతని, పూర్వము నుండి దేవుడు వారికోసం చేసిన కార్యాలను యెహోషువ ఇక్కడ గుర్తు చేస్తున్నాడు కానీ, ప్రజల యొక్క తిరుగుబాటును, పాపాన్ని, దాన్ని బట్టి పొందిన శిక్షను గుర్తు చేయట్లేదు. దేవుడు ఎలా రక్షించాడు, ఎలాంటి నిరీక్షణ లేని స్థితి నుండి పైకి లేపాడు, విడిచిపెట్టకుండా మనకి తోడుగా వుండి మన పక్షాన చేసిన కార్యల్ని జ్ఞాపకం చేసుకోవాలి కానీ, అప్పుడు నీవు అలా అన్నావు, ఇలా చేశావు, అందుకే ఇలా జరిగింది. నా మాట పట్టించుకోలేదు అందుకే ఆలస్యమైంది అని ఒకరి తప్పుల్ని ఒకరు చూపించుకుంటూ ఇతవరకూ నడిపించిన దేవుని విశ్వాస్యతని తృణీకరించకూడదు. ఒక్కడైన అబ్రహాము కి ఇచ్చిన వాగ్దానాన్ని  బట్టి ఇప్పుడు 12 గోత్రములుగా, అనేక వంశాలుగా లక్షలాదిగా వృద్ధి చెందిన అతని సంతానము ఇప్పుడు తాము కట్టని ఇండ్లలో నివసిస్తూ, తాము నాటని తోటల పండ్లని తింటున్నాడు.

నమ్మదగినవాడు

           యేసుప్రభువు నందు విశ్వాసముంచి, పాపములను ఒప్పుకొనుట ద్వారా నమ్మదగిన దేవుడు మనల్ని తన కుమారులుగా చేసుకుని, ఆయన యందు వాగ్దానం చేయబడిన ప్రతీ మంచి విషయాన్ని మనకు అనుగ్రహిస్తున్నాడు. మన ప్రార్థనలను ఆలకించి జవాబిస్తున్నాడు, క్షమిస్తున్నాడు, శోధనల్లో జయమిచ్చి, బలహీనతల్లో బలపరుస్తున్నాడు, ఆదరించి లేవనెత్తుతున్నాడు. నేడు మనం అనుభవిస్తున్న రక్షణ , క్షమాపణ అంతా దేవుని కృపని బట్టి దొరికినవే.

               ఇక్కడ యెహోషువ పూర్వము నుండి నేటి వరకు దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసి, ఆయన యొక్క విశ్వాస్యతని గురించి చెప్తున్నాడు గానీ, నా నాయకత్వములోనే మీరు యొర్దానును దాటారు. మీ  ముందుండి యుద్దాలను నడిపించాను. నా సారధ్యములోనే ఈ రోజు మీరు ఈ దేశాన్ని స్వాధీనం చేసుకోగలిగారు అని చెప్పట్లేదు. సాధారణముగా మనుషులు జరిగిన మంచి కార్యాలని తమ భక్తి ఖాతాలో వేసుకుంటారు. నా ప్రార్థనని బట్టి దేవుడు సహాయం చేసాడు. నా విశ్వాసాన్ని బట్టి ఈ కార్యం జరిగింది. నేను దేవుని కోసం పనిచేశాను కాబట్టి ఆయన మన పని చేసిపెట్టాడు అంటూ ఉంటారు. అయితే దేవుని మహిమ కొరకు ఇలా మాట్లాడుతున్నామా లేక మన భక్తి, ఆత్మీయ స్థితిని కనబరచుకోడానికి మాట్లాడుతున్నామా పరిశీలించుకోవాలి.

       మనం దేవునియందు విశ్వాసం కలిగి ఉన్నాము.ఆయనని నమ్మగలుగుతున్నాము అంటే దేవుని యొక్క  విశ్వాస్యత, నమ్మకత్వమే మనల్ని ప్రోత్సహిస్తున్నాయి అని అర్థం చేసుకోవాలి. 

మీరు ఎవరిని సేవిస్తారు

         ఇంకా యెహోషువ మాట్లాడుతూ వాగ్దాన ఫలములు అనుభవించుచున్న మీరు దేవునియందు భయభక్తులు కలిగి ఏ కపటము లేకుండా, సత్యముగా ఆయనని సేవించండి. ఒక వేళ దేవుడ్ని సేవించడం మీ దృష్టికి మంచిగా లేకపోతే, మీరు ఎవర్ని సేవించుకుంటారో మీ ఇష్టం  అయితే నేను నా ఇంటివారు మాత్రం యెహోవానే సేవిస్తాము అని చెప్పాడు. అంతకు ముందు మోషే కూడా మీరు దేవునియందు భయభక్తులు కలిగి దేవుడ్ని సేవించండి అని చెప్పాడు. ఇప్పుడు యెహోషువ కూడా అదే విషయాన్ని బలంగా వారికి తెలియచేస్తున్నాడు. 

నేనును నా ఇంటివారును

     దేవుని శక్తిని బట్టి బానిసత్వం నుండి, ఇనుప కొలిమిలో నుండి, అరణ్యం నుండి, విడిపించబడి, ఆశీర్వదంలోనికి వచ్చి, వాగ్దాన ఫలాలను అనుభవిస్తున్నారు. మీరు ఎందుకోసం పిలవబడ్డారో, లోకం నుండి వేరుచేయబడ్డారో ఎలా విమోచించబడ్డారో గుర్తు చేసుకోండి. పోరాటాలు, కష్టాలు,శ్రమలు ఉన్నప్పుడు దేవుడ్ని వెంబడించి, ఆయన సహాయం కోరుకుని విశ్రాంతి, నెమ్మది కలిగిన తర్వాత ఆయనని  విడిచిపెట్టకూడదు. యేసయ్య యొక్క విలువైన రక్తము ద్వారా దేవుని సొత్తైన మీరు ఆయననే సేవించాలి. అయితే దేవుడ్ని సేవించడమో, సేవించకుండా ఉండడమో మిరే ఎంపిక చేసుకోండి. కానీ నేను, నా ఇంటివారు మాత్రం యెహోవానే సేవిస్తాము అని తన నిర్ణయాన్ని కూడా తెలియజేశాడు. దేవున్ని నమ్మడం, నమ్మకపోవడం, సేవించడం, సేవించకపోవడం మనం తీసుకోవాల్సిన నిర్ణయమే.

ఏది ఎంచుకోవాలి

        ఈ లోకంలోని ఆశాలని, అవకాశాల్ని, ప్రోత్సాహకాలనీ వెంబడించి, చివరికి నిరాశలు, అసూయలు,ఒంటరితనంతో కృంగిపోవడం అయినా, అదే లోకంలో దేవుని చిత్తాన్ని వెదికి, వాక్యానుసారంగా చేసి, నిరీక్షణ, సంతోషంతో జీవించడమైనా మన ఎంపికలని బట్టే ఉంటుంది. మన  తర్కాన్ని, వివేకాన్ని నమ్ముకుని దేవుడు లేడని వారించే బుద్ధిహీనులవడానికైనా, లేదా బుద్ధి జ్ఞాన సర్వ సంపదలు గుప్తమైయున్న దేవుని యందు విశ్వాసముంచడానికి అయినా మనమే నిర్ణయించుకోవాలి. దేవున్ని విశ్వాసముతో వెంబడించుట వలన కార్యాలు జరుగుతాయి కానీ తర్కం వలన జరగవు. దేవుడ్ని ప్రేమించడం, ప్రేమించకపోవడం మనం తీసుకోవాల్చిన నిర్ణయం అయివుంది.

      యెహషువ అయితే ఐగుప్తులో, బానిసత్వములో ఉన్నప్పుడు కూడా దేవుడ్ని సేవించాడు, దేవుడు పంపించిన మోషేని హత్తుకుని ఉన్నాడు. ప్రజలందరూ తనని రాళ్ళతో కొట్టి చంపాలనుకున్నప్పుడు కూడా తన విశ్వాసాన్ని విడిచిపెట్టలేదు.  సైన్యములకు అధిపతియైన వానికి తనని తాను అప్పగించుకుని, ప్రజలకు వాగ్దాన  దేశాన్ని స్వాధీనం చేసాడు. సవాలుకర పరిస్థితులు అయినా, నిందలు విమర్శలు ఎదురైనా, తన యజమాని అయిన దేవుడు అప్పగించిన పనిని నమ్మకంగా చేసాడు.

         "మనం ఎవర్ని సేవిస్తామో వారే మనపైన యజమానులు అవుతారు. మన హృదయంలో రాజు ఎవరు? వేటిని ప్రేమిస్తున్నాము? ఏ మాటలకి లోబడుచున్నాము? ఎవరి మహిమ కోసం, ఎవర్ని సంతోషపెట్టాలని పని చేస్తున్నామో వారికే మనం సేవకులమవుతాము."

          ఇక్కడ యెహోషువ తాను తన జీవితకాలం సేవించిన దేవుడ్ని ప్రజలు కూడా నమ్మకంగా వెంబడించాలని నిర్ణయించుకోమన్నప్పుడు ప్రజలు- మేము దేవుడ్ని విడిచిపెడితే శాపగ్రస్తులమైపోతాము. మమ్మలి విడిపించి, మా ముందు గొప్ప సూచక క్రియలుచేసి మా మార్గమంతటిలో, వెళ్లిన ప్రజలందరి మధ్యలో, మనల్ని కాపాడిన యెహోవాయే మా దేవుడు. మేము ఆయననే సేవిస్తాము అని చెప్పారు.

యెహోవానే సేవిస్తాము

      మా కోసం ఇంతచేసిన దేవుడ్ని మేము సేవించకుండా ఎలా ఉంటాము ఆయనే మా దేవుడు అని వారు చెప్పినప్పుడు యెహోషువ వారితో దేవుడు పరిశుద్ధుడు, రోషం గలవాడు. ఆయన మీ అపరాధములను పరిహరింపనివాడు. మీరు ఆయనను సేవించలేరు. మీరు ఆయనని విడిచిపెడితే మేలు చేయడం మని, కీడు చేస్తాడు, మిమ్మల్ని క్షిణింప చేస్తాడు అని చెప్తాడు. అంటే తన మాటలతో ప్రజలని నిరుత్సాహపరచడం కాదు గానీ, దేవుడ్ని సేవిస్తాము అని వారు చేసిన నిబంధనను తేలికగా తీసుకుని నిర్లక్ష్యపెట్టకూడదని దేవుని గుణాతిశయములను తెలియచేసి వారిని హెచ్చరిస్తున్నాడు. 

ఆయన రోషము గలవాడు

        తన సిలువను మోసికొని నన్ను వెంబడింపని యెడల వాడు నా శిష్యుడు కానేరడు అని యేసయ్య చెప్తున్నాడు. నేను దేవుడ్ని నమ్ముకున్నప్పుడు, ఆయనని వెంబడిస్తాను అంటే, మన సిలువను మోసికొని ఆయనను వెంబడించాలి. దేవుడు పరిశుద్ధుడు కాబట్టి మనం కూడా పరిశుద్ధంగా  ఉండాలని ఆయన అజ్ఞాపిస్తున్నాడు.

      శాశ్వతమైన ప్రేమతో, నిజమైన ప్రేమతో మనల్ని ప్రేమించి తనను తానే మన కోసం అర్పించుకున్న దేవుడు రోషము గలవాడు. ఆయన మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడో తిరిగి మనం కూడా ఆయనను పూర్ణ హృదయంతో ప్రేమించాలని అజ్ఞాపిస్తున్నాడు.

       ఒకవైపు దేవుడూ కావాలి, అలాగే నాకిష్టమైనట్లుగా కూడా నేను జీవించాలి, దేవుడు దేవుడే కానీ వ్యక్తిగత జీవితం నాదే అన్నట్లు ఉంటే దేవుడ్ని సేవించినట్లు కాదు. దేవునికి మన హృదయములో, జీవితములో అధికారమిచ్చి,ఆయనకు సేవకులుగా ఉంటే ఏం కలుగుతుంది, దేవుడ్ని సేవించకపోతే ఏం కలుగుతుందో  దేవుని వాక్యంలో తెలియజేయబడింది. కాబట్టి తనని ఎలా సేవించమని దేవుడు చెప్పాడో మనం అలాగే ఆయనని ప్రేమించడానికి మనం ప్రతీ రోజు ఎంపికలు చేసుకోవాలి. మాట ఇచ్చి తప్పని దేవుడ్ని జీవిస్తున్న మనం, దేవునితో చేసిన నిబంధనని నిలబెట్టుకోవాలి. పరిశుద్ధుడైన దేవుడ్ని మీరు సేవించలేరు అని యెహోషువ చెప్పినప్పుడు ప్రజలు అతనితో అలా కాదు, మేము యెహోవానే సేవిస్తాము అని చెప్పారు. అందుకు యెహోషువ దేవుడ్ని సేవిస్తాము అని మీరు కోరుకున్నదానికి మీరే సాక్షులు . మీ హృదయాల్ని దేవుని వైపుకి తిప్పుకోండి అని అక్కడ షెకెములో కట్టడను, విధిని నియమించాడు.

      ఈ మాటలన్నిటిని ధర్మశాస్త్రములో వ్రాయించి , వీరు చేసిన నిబంధనకి గుర్తుగా అక్కడొక రాతిని నిలువబెట్టించాడు. ఇవన్నీ జరిగిన తర్వాత 110 సంవత్సరముల వయస్సులో యెహోషువ చనిపోయి పాతిపెట్టబడ్డాడు. తర్వాత ఐగుప్తులో చనిపోయిన యోసేపు యొక్క కోరిక ప్రకారం అతని ఎముకలను ఆ వాగ్దాన దేశంలో పాతిపెట్టారు. తర్వాత యాజకుడైన ఎలియాజరు కూడా చనిపోయి పాతిపెట్టబడ్డాడు. దేవుడు ఇశ్రాయేలీయుల కోసం చేసిన క్రియలన్ని ఎరిగిన పెద్దలు ఉన్న దినములన్నిటిలో ప్రజలు దేవుడ్ని సేవిస్తూ వస్తున్నారు. దేవుడు హెచ్చాలి నేను తగ్గాలి అని తన జీవితకాలమంతా దేవుడ్ని సేవించిన యెహోషువ తన చివరి దినములలో కూడా అలాగే సేవించి, ప్రజలందరూ కూడా దేవుడ్ని సేవించాలని వారితో నిబంధన చేయించాడు. మనకి ఇంకా సమయం ఉండగానే మనం దేవుడ్ని వెంబడించడానికి నిర్ణయించుకోవాలి.

        మన బలహీనతలను వాడుకొని, శోధించి మనల్ని నరకానికి తీసుకువెళ్ళే అపవాది మాట విని మోసపోకుండా మన అవసరతలు, బలహీనతలు, శోధనలు అన్నీ తెల్సిన దేవుడ్ని సేవించినప్పుడు ఆయన మనకి సరైన సహాయం చేస్తాడు. ప్రతి రోజు మన జీవితంలో నమ్మదగిన దేవుడ్ని నమ్మకంగా సేవించే ఎంపికలు చేసుకుందాం.

    " మీరెవరిని సేవింప కోరుకొనినను,  నేనును నా ఇంటివారును యెహోవాను సేవించెదము అనెను."(యెహోషువ 24:15)

ప్రార్ధన

   నిన్ను నీవు తగ్గించుకుని మా కోసం చేసిన రక్షణ కార్యముకై వందనాలు. మా ముందు నడిచి, మా శోధనలు, బలహీనతలన్ని ఎరిగి మాకు సహాయం చేసున్నందుకు వందనాలు. నీవు నమ్మదగిన దేవునిగా మా పాపాల్ని క్షమించి, రక్షించినందుకు వందనాలు. నీవు మాట తప్పక నీ విశ్వాస్యతను మా యెడల చూపిస్తున్నావు. మేము కూడా నమ్మకంగా నిన్ను సేవించడానికి సహాయం చేయండి. నిన్ను ప్రేమించడానికి మా సిలువనెత్తుకుని నిన్ను వెంబడించడానికి, మేము సరైన నిర్ణయాలు తీసుకోడానికి, సరైన ఎంపికలు చేసుకోడానికి సహాయం  చేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి ఆమెన్.

-శుభవచనం