ఆశ్రయము కలదు | Joshua 17 -23 | Telugu Bible Study
యెహోషువ 17-23 అధ్యాయములు బైబిల్ ధ్యానము
యెహోషువ 17 వ అధ్యాయం
సెలూపెహాదు కుమార్తెల స్వాస్థ్యము
ఇక్కడ మనష్షే వంశస్థుడైన సెలూపెహాదు యొక్క ఐదుగురు కుమార్తెలు యెహోషువా దగ్గరకు వచ్చి మోషే కాలంలో తమకు వాగ్దానం చేయబడిన ప్రకారం తమకి స్వాస్థ్యము ఇవ్వాలని అడుగుతారు. అంతకుముందు మోషే బ్రతికి ఉన్నప్పుడు, వారు ఇంకా అరణ్యంలో ఉండగానే ఈ ఐదుగురు అక్కాచెల్లెళ్ళు మోషే దగ్గరికి వెళ్లి దేవుడు అనుగ్రహించిన దేశంలో మాకు కూడా స్వాస్థ్యాన్ని ఇవ్వమని అడిగినప్పుడు మోషే వారి విషయమై దేవునికి ప్రార్థన చేస్తాడు. అప్పుడు దేవుడు మిగిలిన వారితో పాటు వీరికి కూడా స్వాస్థ్యమును పంచి పెట్టాలని మోషేకు ఆజ్ఞాపిస్తాడు.
ఆ విషయాన్ని ఇప్పుడు ఈ అమ్మాయిలు యెహోషువకి జ్ఞాపకం చేయగా, అతను వారికి స్వాస్థ్యాన్ని ఇస్తాడు. వీరు మౌనముగా వుండి, అడగకుండా వుంటే పొందుకునేవారు కాదేమో.కానీ సర్వ సమాజము ముందు మోషే దగ్గరకి వెళ్ళి ఎలా ధైర్యముగా ఆడిగారో అలాగే ఇప్పుడు యెహోషువ దగ్గరకి కూడా వెళ్లి సంపాదించుకున్నారు.
యెహోషువ 18 వ అధ్యాయము
ఇంకా ఎంత కాలం ఆలస్యం చేస్తారు
ఇశ్రాయేలీయులు ఆ దేశాన్నంతా సంపాదించుకున్నారు గాని వారిలో 7 గోత్రముల వారు మాత్రం వారి భాగాలను ఇంకా స్వాధీనం చేసుకోలేదు. అప్పుడు యెహోషువ దేవుడిచ్చిన దేశాన్ని స్వాధీన పరచుకోకుండా ఇంకా ఎంత కాలం ఆలస్యం చేస్తారు, ముందు వెళ్లి దేశ సమాచారాన్ని వివరంగా వ్రాసి తీసుకురండి, దేవుని సన్నిధిలో మీకు భాగాలను పంచుతాను అని వారిని త్వరపెట్టి పంపిస్తాడు.
ఈ భూభాగం అంతా మన చేతుల్లోనే వుంది,ఇప్పటి వరకూ పోరాడి,పోరాడి అలసిపోయాము, తర్వాత స్వాధీనం చేసుకోవచ్చు. శత్రువులు కూడా మనకి భయపడిపోయారు కాబట్టి ఇంక భద్రంగా భయం లేకుండా ఉండొచ్చు, ఇంకా ప్రయాసపడి సంపాదించుకునేది ఏముంది, ఎలాగో మనదే కదా అని తమ భాగాలను స్వాధీనం చేసుకోడానికి నిర్లక్ష్యం చేస్తున్నారు. దేవుడు వారిని ఎందుకు పిలిచాడో ఆ నిజమైన దీవెనని సంపాదించుకోడానికి ఇంకా ఆలస్యం చేసున్నారు. అరణ్యములో యాత్రికులుగా తిరగడం కంటే ఇక్కడ బాగానే వుంది అనుకుంటున్నారు గానీ స్థిరమైన నివాసం కొరకు ప్రయాసపడటానికి ఆసక్తి చూపించట్లేదు.
పూర్తిగా దేవునియందు విశ్వాసముంచకుండా, పూర్తిగా ఆయనకి లోబడకుండా, జయించాల్చినవాటిని జయించకుండా, కృపలను పోగొట్టుకుంటున్నవారిని, ఇంకా ఎంతకాలము మిమ్మల్ని సహించాలి అని యేసయ్య గద్దిస్తున్నాడు. మీ అల్ప విశ్వాసం సహించరానిది. లోకంలో కనబడేవాటితోనే తృప్తిపడిపోయి దేవుని కృపలని పొందకుండా, పరిస్థితులతో రాజీపడిపోయి ఆత్మీయముగా ఫలించకుండా, నిర్లక్ష్యముతో, సోమరితనంతో, ఆశీర్వాదాన్ని ఆలస్యం చేసుకోవడం మేలైనదికాదు. కొండలను కదిలించగల విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని యేసయ్య హెచ్చరిస్తున్నాడు.
నేడే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం అని చెప్పబడింది కాబట్టి దేవుడిచ్చే రక్షణని , పరిశుద్ధతని, దీవెనని పొందడానికి ఆలస్యము చేయకూడదు. ప్రార్థనతోనూ, విశ్వాసపు క్రియలతోను సంపాదించుకోవాల్చినవాటిని పొందకుండా ఎందుకు తడవు చేస్తున్నావు? ఎంతవరకు అల్పవిశ్వాసాన్ని సహించాలి అన్న దేవుని గద్దింపును తీసుకుని ఆయనకు లోబడాలి. ఇక్కడ ఇశ్రాయేలీయులు యెహోషువకి లోబడి దేశ సంచారము చేసి, వివరాలు వ్రాసికొని వచ్చినప్పుడు అతను దేవుని సన్నిధిలో చీట్లు వేసి వారికి స్వాస్థ్యాన్ని పంచిపెట్టారు. మనం చేయవలసినదానిని చేసి నిత్యమైన దీవెనను పొందునట్లుగా దేవుని ప్రేమ మనల్ని తొందరపెట్టినప్పుడు విశ్వాసముతో లోబడాలి.
ప్రజలందరికీ తమ తమ భాగాన్ని పంచిపెట్టుట ముగించిన తర్వాత యెహోషువ తన స్వాస్థ్యాన్ని తీసుకున్నాడు.
యెహోషువ 20 వ అధ్యాయము
ఆశ్రయ పురములు
ఈ అధ్యయములో ఆశ్రయపురముల ఏర్పాటును గురించి దేవుడు యెహోషువతో మాట్లాడుతున్నాడు. ప్రతికారాన్ని తప్పించుకోవడానికి ఒకడు పరుగెత్తుకుని వెళ్లి ఆశ్రయం పొందే విధంగా, అందుబాటులో, ఇశ్రాయేలీయులతో పాటు, అక్కడ నివసించే పరదేసులకు కూడా దేవుడు ఆశ్రయపురములను నియమించాడు. పాపికి తీర్పు తీర్చే దేవుడు మనుషుల యొక్క పాపాన్ని చూసి చూడనట్లు వదిలేయలేదు గానీ ఎలాంటి పాపి అయినా వచ్చి తీర్పు నుండి తప్పించుకోడానికి, నశించిపోకుండా రక్షింపబడటానికీ సిలువలో ఆశ్రయాన్ని కల్పించాడు.
పాపం చేసి దేవుడిచ్చే మహిమను కోల్పోయిన మనకు తిరిగి తన మహిమను ఇవ్వడానికి, ఇక్కడ మీకు ఆశ్రయం వుంది రమ్మని సిలువపైనుండి యేసయ్య పిలుస్తున్నాడు. మన కోసం మరణించిన ఆయనను ఆశ్రయించకపోతే తీర్పు పొంది, శిక్షను అనుభవించాలి. కానీ ఎలాంటి హృదయంతో అయిన, ఏ పాపం చేసినా, సిలువ దగ్గరకి వచ్చి పశ్చాత్తాపపడినప్పుడు, ఆయన రక్షణ నిస్తాడు, తన మహిమను ఇస్తాడు. ఏ భేదము లేకుండా మనుష్యులందరూ పాపం చేసినవారే. కాబట్టి ప్రతి ఒక్కరికీ కూడా దేవుని ఆశ్రయం కావాలి. ఆయన దయని కోరి వచ్చిన ఎవర్ని కూడా ఆయన విడిచిపెట్టడు.
ఎలాంటి పాపి అయినా వచ్చి తీర్పు నుండి తప్పించుకోడానికి, నశించిపోకుండా రక్షింపబడటానికీ సిలువలో ఆశ్రయాన్ని కల్పించాడు
యెహోషువ 21వ అధ్యాయము
పరిశుద్ధమైన దేవుని ప్రజలుగా
లేవీయులకి కనాను దేశంలో ప్రత్యేకమైన స్వాస్థ్యము ఏదీ లేదు కాబట్టి వారు నివసించడానికి దేవుని ఆజ్ఞ ప్రకారం కొన్ని పట్టణాలు, పొలాలు వారికి ఇయ్యబడ్డాయి. ఇశ్రాయేలీయులలో ప్రతీ గోత్రము కూడా దేవునితో సంబంధం కలిగి ఉండాలని, అన్ని గోత్రాలవారి భాగాలలో వీరికి నివాసాలు ఇయ్యబడ్డాయి. ఒకప్పుడు చీకటిలో వుండి ఇప్పుడు వెలుగులోకి నడిపించబడిన ప్రతీ ఒక్కరూ కూడా దేవుని యొక్క సువార్తను ప్రచురం చేయు వంశముగా, పరిశుద్ధమైన దేవుని ప్రజలుగా ఉన్నారు. కాబట్టి అందరూ అంతటా మారుమనస్సు పొందునట్లుగా సర్వ సృష్టికీ సువార్తను ప్రకటించాలని దేవుడు అజ్ఞాపిస్తున్నాడు. ( 1 పేతురు 2:9).ఇక్కడ దేవుడు తాను ప్రమాణము చేసిన దేశమంతటినీ ఇశ్రాయేలీయులకి అప్పగింపగా, వీరు దానిని స్వాధీనపరచుకుని అందులో నివసిస్తున్నారు. అన్ని దిక్కుల నుండి కూడా దేవుడు వారికి విశ్రాంతిని కలుగచేశాడు. ఒక్క శత్రువు కూడా వారి ముందు నిలువలేక పోయారు. దేవుడు ఇశ్రాయేలీయులతో చెప్పిన మాటలలో ఏదీ తప్పిపోకుండా అంతా నెరవేరింది. దేవుడు మాట ఇచ్చి తప్పని వాడు.
యెహోషువ 22వ అధ్యాయము
దేవుని కొరకై రోషము
దేవుని మీద తిరుగుబాటు చేసి, వేరొక బలిపీఠం కట్టి ఆయనకు కోపం రేపుతున్నారేమో, దేవునికి కోపం పుట్టించేది ఏదీ తమ మధ్య ఉండకూడదు అని ఇశ్రాయేలీయులు రోషంతో రూబేనీయులపైకి యుద్ధానికి తయారయ్యారు. అయితే వారు తమ దగ్గరకు వచ్చిన ఇశ్రాయేలీయుల పెద్దలతో మేము దేవునికి విరోధముగా, ద్రోహంగా బలులర్పించడానికి ఈ బలిపీఠాన్ని కట్టలేదు. యొర్దాను ఇవతల ఉన్న మా సంతానపు వారు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండినట్లుగా, అవతల వున్న మీరు మేము సహోదరులమని మీకు, మాకు మధ్య సాక్షిగా ఈ బలిపీఠాన్ని కట్టాము అని చెప్పినప్పుడు ఫీనెహాసుతో పాటు ఇశ్రాయేలీయులందరూ సంతోషిస్తారు.
దేవున్ని సంతోషపెట్టే విధంగా జీవించాలనీ, ఆయనకు కోపం పుట్టించి, ఆయన ఉగ్రతను చూడకూడదని ఇశ్రాయేలీయులు దేవుని విషయమై రోషంగా ఉన్నారు.
యెహోషువ 23వ అధ్యయము
యెహోషువ చివరి మాటలు
అందరు శత్రుభయం లేకుండా నెమ్మదితో వాగ్దాన దేశంలో జీవిస్తూ ఉన్నారు. అప్పుడు వృద్ధుడైన యెహోషువ ప్రజలలో పెద్దలని, ముఖ్యమైన న్యాయాధిపతులను పిలిపించి, వారితో దేవుని విశ్వాస్యతని గురించి మాట్లాడుతున్నాడు. మీకోసం దేవుడే యుద్ధం చేసి ఈ దేశాన్ని మీకు స్వాధీనం చేశాడు. మీరు దేవుని ధర్మశాస్త్రము నుండి కుడికిగానీ, ఎడమకు గానీ తొలగకుండా, అనుసరించడానికి మీ మనస్సును ధృడపరచుకోండి. దేవుడ్ని హత్తుకుని వుండి, బహుజాగ్రత్తగా ఆయనని ప్రేమించండి. ఒక వేళ మీరు దేవుడ్ని విడిచిపెడితే, మీ ముందు వెల్లగొట్టబడిన ఈ జనులే మీకు ఉరిగా తయారవుతారు. ఇదిగో దేవుడు చెప్పిన మంచి మాటల్లో ఒక్కటి కూడా తప్పిపోకుండా అంతా నెరవేరడం మీరు అనుభవపూర్వకంగా చూశారు. ఎలా అయితే మీకు కలిగిందో, దేవుడ్ని విడిచిపెడితే కీడు కూడా అలాగే కలుగుతుంది అని వారిని హెచ్చరించాడు.
మన ప్రభువైన యేసుక్రీస్తుయొక్క తండ్రియగు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన క్రీస్తునందు పరలోకవిషయములలో ఆత్మసంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకనుగ్రహించెను.(ఎఫెసీయులకు 1:3)
ఈ లోకంలో యేసు ప్రభువు నందు ప్రతీ ఆశీర్వాదాన్ని దేవుడు మనకి అనుగ్రహించాడు (ఎఫెసి 1:3). యేసయ్యను హత్తుకుని ఆయనను ప్రేమించినంతకాలం ప్రతీ ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకుంటాము. అలా కాకుండా ఆయనను విడిచిపెట్టినట్లైతే, అప్పటివరకూ ఏ శత్రువైతే మనల్ని చూసి భయపడ్డాడో ఆ సాతానే మనకి ఉరిగానూ, కన్నుమీద ముల్లు గాను, ప్రక్కలో కొరడాగాను ఉంటాడు. ఇక్కడ యెహోషువ సర్వలోకులు వెళ్లే మార్గమున వెళ్లిపోతూ, ఇశ్రాయేలీయులకు దేవుని యొక్క విశ్వాస్యతని గుర్తుచేస్తున్నాడు. దేవుడ్ని హత్తుకుని వుండమని, వాక్యం నుండి తప్పిపోవద్దనీ, దేవుడ్ని కలిగి ఉండడాన్ని బట్టి మనం అపవాదిని జయించగలమనీ, దేవుడ్ని విడిచిపెడితే నశించిపోతామని హెచ్చరిస్తున్నాడు.
శరీరధారిగా మన మధ్యలో నివసించిన యేసయ్యను, వాక్యం ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మనతో ఎల్లప్పుడూ వుంటున్న దేవుడ్ని మనం ప్రేమించినప్పుడు, ఆయన మనల్ని ఫలభరితంగా చేస్తాడు. అపవాదిని మన ఎదుట నుండి తరిమివేసి పాప క్షమాపణను, నిత్యమహిమను దయచేస్తాడు. కాబట్టి మీరు బహు జాగ్రత్తపడి, మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను (యెహోషువ 23:11)
ప్రార్థన
-శుభవచనం

Post a Comment