దేవుని సమయం కోసం | Joshua 14-15 | Telugu Bible Study
దేవుని సమయం కోసం ఎలా ఎదురు చూడాలి - యెహోషువా 14,15 అధ్యాయములు
నిండుమనస్సుతో దేవున్ని అనుసరించాలి.
కాలేబు
మోషే ద్వారా దేవుడు ఆజ్ఞాపించినట్లుగా యాజకుడైన ఎలియాజరు మరియు యెహోషువలు ఇశ్రాయేలీయుల గోత్రాలకి స్వాస్థ్యాన్ని పంచిపెట్టారు. ఇక్కడ యూదా వంశస్తుడైన కాలేబు యెహోషువా దగ్గరకు వచ్చి ఒక మనవి చేస్తున్నాడు. కాదేషు బర్నయాలో వున్నప్పుడు మన ఇద్దరి గురించి దేవుడు మోషేతో చెప్పిన మాట నీకు జ్ఞాపకం వుంది కదా, నలబై సంవత్సరాల వయస్సులో ఈ దేశాన్ని వేగిచూడటానికి నన్ను పంపించినప్పుడు నేను ఎవరికి భయపడకుండా చూచినది చూచినట్లే వర్తమానము తెచ్చాను. మనతో పాటు వచ్చినవాళ్ళు ఆ అనాకీయులకు భయపడి, జనులను కూడా భయపెట్టి జనుల హృదయాలను కరుగజేశారు. కానీ నేను మాత్రం నా దేవున్ని నిండుమనస్సుతో అనుసరించాను. అందుకు మోషే ఆ రోజు నీవు పూర్ణహృదయముతో దేవున్ని అనుసరించావు కాబట్టి నీవు అడుగుపెట్టిన భూమి నీకు నీ సంతానానికి ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉంటుంది అని నాతో ప్రమాణము చేశాడు. దేవుడు మోషేతో ఆ మాట చెప్పినప్పటి నుండి ఇప్పటి వరకు ఈ నలబై ఐదు సంవత్సరములు కూడా ఈ అరణ్య మార్గములో ఆయన నన్ను సజీవునిగా కాపాడాడు. అప్పుడు నలబై సంవత్సరాల వయస్సులో మోషే మనలను పంపించినప్పుడు నాకు ఎంత బలముందో ఇప్పుడు ఈ ఎనభై ఐదు సంవత్సరముల వయస్సులో కూడా అంతే బలంగా వున్నాను. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా ఈ కొండ ప్రదేశాన్ని నాకు దయచేయి. దేవుడు నాకు తోడై యుంటారు కాబట్టి ఆ బలమైన అనాకీయులను జయించి ఈ గొప్ప ప్రకారాలని, గొప్ప పట్టణాలను స్వాధీనం చేసుకుంటాను అని కాలేబు యెహోషువాని అడుగుతున్నాడు.
కాలేబు నిండుమనస్సుతో వెంబడించాడు కాబట్టి ఇప్పటికి కూడా ధైర్యముగా మాట్లాడుతున్నాడు. ఎప్పుడో నలబై ఐదు సంవత్సరాలప్పుడు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని కాలేబు మర్చిపోలేదు. సరియైన సమయములో ఆ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి కనిపెట్టికుని వున్నాడు. తాను చేయని తప్పుకి అరణ్యములో నలబై సంవత్సరములు తిరుగవలసి వచ్చినందుకు కారణమైన వారిని నిందిస్తూ అతడు కూర్చోలేదు. దేవుని వాగ్దానములు అలస్యమై పోతున్నాయి, తాను బ్రతికుండగా చూడగలనో లేదో, నాతో వచ్చినవాళ్ళు అందరూ అరణ్యములోనే చనిపోతున్నారు, నేను ఇంకా ఎంతకాలం బ్రతుకుతానో తెలియదు అని నిరాశపడిపోలేదు. ఇంకా ఏదో జరుగుతుందని ఎదురుచూస్తూ వుండలేను, నేను నా కుమారులు కలసి వెళ్లి ఎలాగైనా పోరాడి మా భాగాన్ని మేము సంపాదించుకుంటాము అని స్వంత నిర్ణయాలు తీసుకుని స్వంత మార్గములో వెళ్లిపోలేదు. నిరాశపరచే ఎన్నో సందర్భాలు, సంఘటనలు ఈ నలబై ఐదు సంవత్సరాలలో ఎదురైన నిండుమనస్సుతో అతడు దేవున్ని వెంబడించడం మానలేదు. దేవుని సమయం కొరకు ఓపికతో కనిపెట్టారు. దేవుని పై ఆయాసపడలేదు, ఆయన్ని విడిచి పెట్టలేదు.
పూర్ణమనస్సుతో దేవుని కొరకు ఎదురుచూసిన కాలేబు ఎనభై ఐదు సంవత్సరాల వయస్సులో కూడా బలవంతుడిగా ధైర్యముగా వున్నాడు. సుదీర్ఘకాలం వేచి ఉండాల్సి వచ్చినా నిండుమనస్సుతో దేవున్ని అనుసరించారు. ఎవడైనా నన్ను వెంబడించాలనుకుంటే తన్ను తాను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకొని నన్ను వెంబడించాలి అని యేసయ్య చెప్పాడు. మన స్వీయానికి, అహానికి, మన స్వభావానికి దినదినము చనిపోవాలి, క్రీస్తు మనలో జీవించాలి. వేరొకరి అవిధేయతను బట్టి కాలేబు అరణ్యములో వున్నాడు. అయినప్పటికీ రోజులు సంవత్సరాలు గడిచిపుతున్నాయి, వాగ్దానం అలస్యమై పోతుంది. చివరికి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే సమయానికి బలమంతా పోయి ముసలివాడ్ని అయిపోతాను అని నిరాశతో కృంగిపోలేదు.అతడు హృదయమంతటితో దేవుడ్ని వెంబడించాడు. దేవుని వాగ్దానం పొందినప్పుడు ఎలాంటి ఆత్మీయ స్థితిలో ఉన్నాడో ఇప్పుడు అదే ఆత్మీయత, భక్తి, విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు. ఒకప్పుడు ఎంతో భక్తి కలిగి వున్నాను, అప్పుడు ఎన్నో గొప్ప కార్యాలు చూశాను, ఇంతకు ముందు దేవుడ్ని ఎంతో ప్రేమించాను అని చెప్పడం కాదు గానీ, వర్తమానంలో ఇంకా దేవుడ్ని పూర్ణహృదయముతో అనుసరిస్తున్నామా, వాగ్దానాన్ని స్వతంత్రించుకునే స్థితిలో ఉన్నామో లేదో పరిశీలించుకోవాలి.
మన పోరాటాన్ని మనమే పోరాడాలి.
ఒత్నీయేలు
దేబీరు అను పట్టణాన్ని జయించిన వారికి తన కుమార్తెను ఇచ్చి పెండ్లి చేస్తాను అని కాలేబు చెప్పినప్పుడు ఒత్నీయేలు ఆ సవాలుని తీసుకుని ఆ పట్టణాన్ని జయించి, అక్సాని పెండ్లి చేసుకుంటాడు. దెబీరు పట్టణాన్ని స్వాధీనం చేసుకోడానికి ఒత్నీయేలు భయపడలేదు. మన కోసం సిద్ధపరచబడిన మేలులను, స్వాస్థ్యమును పొందుకునే క్రమంలో ఆత్మసంబంధముగా ఎవరి పోరాటాన్ని వారు పోరాడాల్సి వుంది. దేవునికి లోబడుడి అపవాదిని ఎదిరించండి అప్పుడు వాడు మీ దగ్గరనుండి పారిపోతాడు. దేవుని శక్తిని బట్టి బలవంతులై ఉండుడి. సాతాను తంత్రములను ఎదిరించడానికి, మీకు అప్పగింపబడిన సమస్తాన్ని నెరవేర్చి శక్తిమంతులుగా నిలబడటానికి, దేవుడిచ్చు సర్వాంగకవచమును ధరించుకోండి అని వాక్యం మనకి చెప్తూ వుంది. (ఎఫెసి 6:13)
మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును, సమస్తము నెరవేర్చినవారై నిలువబడుటకును శక్తిమంతులగునట్లు, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. (ఎఫెసీయులకు 6:13 )
మన స్వభావాన్ని, ఆలోచనల్ని,తలంపులన్నింటిని దేవునికి లోబరచినప్పుడు, ఆయన నమ్మదగినవాడు కాబట్టి మన పోరాటాలాన్నిటిలో జయించడానికి ఆయన సహాయం చేస్తాడు. మన సమస్యలు, పోరాటాలు, అపజయాలు, అవసరతల కోసం ఎప్పుడూ మరొకరి ప్రార్ధనలపై, భక్తిపై ఆధారపడడమే కాక, వ్యక్తిగతముగా ఆత్మీయ జీవితాన్ని కట్టుకోవాలి. దేవునితో వ్యక్తిగత సహవాసాన్ని కలిగి వుండి, ఇతరులను కూడా ఆవిధముగా ప్రోత్సహించాలి.85 సంవత్సరాల కాలేబు తాను జయించడమే కాక తన సంతానము కూడా సవాళ్ళకు బెదిరిపోకుండా, విశ్వాసముతో పోరాడేవారిగా ఉండడానికి ప్రోత్సహిస్తున్నాడు. తన విశ్వాసములో, తన భక్తి నీడలో మాత్రమే వారు ఎదగాలని కోరుకోవట్లేదు.
దేవున్ని అడగక పోతే ఏమవుతుంది.
కాలేబు కుమార్తె అక్సా
కాలేబు కుమార్తె అయిన అక్సా అతని దగ్గరకి వచ్చి, నాకు దీవెన దయచేయుము, నీటి మడుగులను దయచేయుము అని అడిగినప్పుడు, ఆమె కోరిన విధముగానే వాటిని అమెకిస్తాడు. తండ్రిని అడిగి సంపాదించుకునే స్వతంత్రత వారి మధ్యలో వుంది. అడుగుడి మీకీయబడును. మీ సంతోషం పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరుకును అని ప్రభువు చెప్తున్నాడు. దేవుడ్ని తండ్రిగా కలిగి, ఆయనని అడిగి పొందే స్వతంత్రత మనకి ఉన్నట్లయితే, మన సంతోషము కొరకు, ఆయన మహిమ కొరకు మనం అడుగుతాము.దేవుడ్ని అడగకుండా మీలో మీరే పొట్లాడుకుంటున్నారు కాబట్టి మీకేమి దొరకట్లేదు. దురుద్దేశముతో అడిగితే మీకేమి దొరకదు అని వాక్యంలో వ్రాయబడి వుంది. (యాకోబు 4:2,3)
నా దగ్గరకు రండి, నేను మీకు తండ్రినై ఉంటాను. మీరు నాకు కుమారులు, కుమార్తెలై వుంటారు అని సర్వశక్తిగల దేవుడు మనల్ని పిలుస్తున్నారు. ( 2 కోరింథి 6:18) . మనం ఆయనకు పిల్లలుగా ఉంటే, ఆయన నా మనవి అలకిస్తాడు, నాకు దయచేస్తాడు అనే విశ్వాసం మనకి ఉంటుంది. తండ్రియైన దేవుడు మనకిచ్చే రక్షణను, దీవెనను, బహుమానమును, అవిశ్వాసముతో పోగొట్టుకోకూడదు. ఆయన మన కోసం సిద్ధపరచిన వాటిని, మనం ప్రియమైన పిల్లలుగా వుండి అడిగినప్పుడు, మనం ఆడిగినవాటి కంటే ఎంతో మేలైనవి ఇస్తాడు. మీరు చెడ్డవారై వుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఇవ్వాలనుకుంటారు. ఐతే పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగువారికి అంతకంటే ఎంతో నిశ్చయముగా మంచి ఈవులనిచ్చును అని యేసయ్య మనం తండ్రిని అడిగి శ్రేష్ఠమైనవాటిని పొందాలని ఉపదేశిస్తున్నాడు.
నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనమునందు కూర్చుండియున్న ప్రకారము జయించువానిని నాతో కూడా నా సింహాసనమునందు కూర్చుండనిచ్చెదను.( ప్రకటన 3:21)


Post a Comment